కళావతి రివ్యూ

తెలుగు – తమిళ పరిశ్రమల్లో మూణ్నాలుగేళ్లుగా హార్రర్ కామెడీ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఆయా భాషల్లో విజయవంతం కావడమే కాదు ఇక్కడి సినిమాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడి సినిమాలు ఇక్కడికీ వస్తున్నాయి. గత ఏడాది సుందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆరణ్మయి’ తమిళంలో సూపర్ హిట్టయి.. తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో అనువాదమై మన ప్రేక్షకుల్నీ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘ఆరణ్మయి-2’ను తెలుగులోకి ‘కళావతి’గా తీసుకొచ్చారు. మరి ఈ హార్రర్ కామెడీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఓ పల్లెటూళ్లో గ్రామ దేవత విగ్రహాన్ని కుంభాభిషేకం కోసం ఉన్న చోటి నుంచి తీసి పక్కకు మారుస్తారు. ఆ సమయంలో అమ్మవారు మహిమ కోల్పోతుంది. ఈ సమయంలోనే ప్రేతాత్మల్ని బయటికి తేవడానికి కొందరు మంత్రగాళ్లు ప్రయత్నిస్తుండగా.. వాళ్లు కోరుకున్న ఆత్మలతో పాటు మరో ఆత్మ కూడా బయటికి వస్తుంది. ఆ ఆత్మ ఆ ఊరి జమీందారు బంగ్లాలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ కారణంగా జమీందారు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఆ ఇంటి డ్రైవర్ కూడా చనిపోతాడు. ఇంకా ఆ ఇంట్లో మరిన్ని అనూహ్య ఘటనలు జరుగుతాయి. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? దాని గతమేంటి? బంగ్లాలోని మిగతా వ్యక్తులు దాన్నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం – విశ్లేషణ:

ఒక బంగ్లా… అందులో బోలెడంత మంది మనుషులు.. ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుంటారు. మిగతావాళ్లు భయపడి చస్తూ నవ్విస్తుంటారు. ఇంటర్వెల్ సమయానికి దయ్యం సంగతి బయటపడుతుంది. ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్.. ఆ తర్వాత స్వామీజీ అరంగేట్రం.. చివర్లో ఓ యాగం.. దయ్యానికి బైబై. హార్రర్ కామెడీ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కథ ఇది.

‘కళావతి’ కూడా అచ్చంగా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోయిన సినిమా. దీని ప్రీక్వెల్ ‘చంద్రకళ’ చూసి ఉన్నట్లయితే దానికిది డిట్టోలా అనిపిస్తుంది. పైగా హన్సిక – సుందర్ లాంటి వాళ్లు ఈ సినిమాలోనూ అదే తరహా పాత్రలు వేశారు కూడా. ‘చంద్రకళ’తో పాటు తెలుగు – తమిళంలో వచ్చిన చాలా హార్రర్ కామెడీల్ని గుర్తుకు తెస్తుంది ‘కళావతి’. కాబట్టి కొత్తదనం కోరుకుంటే మాత్రం ఈ సినిమా నిరాశ పరుస్తుంది. అలా కాకుండా రొటీన్ గా ఉన్నా టైంపాస్ చేయిస్తే ఓకే అనుకుంటే మాత్రం ‘కళావతి’తో ఇబ్బందేమీ ఉండదు.

భయం పుట్టించేసే హార్రర్ ఏమీ లేదు కానీ.. కామెడీ విషయంలో మిగతా మసాలాల విషయంలో ‘కళావతి’ సంతృప్తిపరుస్తుంది. పరోటా సూరి మనకు కొంచెం కొత్త అయినప్పటికీ అతడి కామెడీ సినిమాకు మేజర్ హైలైట్. కోవై సరళ కాంబినేషన్ లో అతడి కామెడీ బాగా వర్కవుటైంది. కామెడీకి తోడు కావాల్సినంత గ్లామర్ విందు కూడా అందించాడు సుందర్. త్రిష కెరీర్ లో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంతగా ఈ సినిమాలో అందాలు ఆరబోసింది. సిద్దార్థ్ తో కలిసి కనిపించే బీచ్ సాంగ్ లో త్రిష రెచ్చిపోయింది. ప్రథమార్ధానికి ఈ పాట – కామెడీ ప్రధాన ఆకర్షణ.

ఐతే హార్రర్ తో ముడిపడ్డ సన్నివేశాలన్నీ రొటీన్ గా అనిపిస్తాయి. వీటికి బాబులాంటి హార్రర్ సన్నివేశాలు మనం చాలా చూశాం. ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీనే. అదేమంత ఆసక్తి రేకెత్తించదు. ఐతే చివరి ముప్పావు గంటలో కథనాన్ని ఆసక్తికరంగా నడిపాడు సుందర్. త్రిషను దయ్యం ఆవహించాక వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ముఖ్యంగా త్రిష-సూరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్.. హోటల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ హంగామా కనిపిస్తుంది. కొంచెం థ్రిల్లింగ్ గా ఉండేలా క్లైమాక్స్ ను తీర్చిదిద్దాడు సుందర్.

సినిమా మొదలైన దగ్గర్నుంచి చివరి వరకు అంతా మనం ఊహించినట్లే జరగడం.. ఒక ఫార్ములా ప్రకారం సినిమాను నడిపించేయడం.. నరేషన్లో కూడా కొత్తదనం లేకపోవడం ‘కళావతి’లో మేజర్ మైనస్. ఈ విషయంలో మనం ఎంతమాత్రం అడ్జస్ట్ అవుతామన్నదాన్ని బట్టి ‘కళావతి’పై ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఈ విషయంలో అసంతృప్తిని కామెడీ గ్లామర్ డోస్ తో కవర్ చేసే ప్రయత్నం చేశాడు సుందర్. కమర్షియల్ అంశాలకు ఢోకా లేకుండా మాస్ ఆడియన్స్ కు నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడతను. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఎక్కువ ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమాల్లో అద్భుతమైన గ్రాఫిక్స్  చూసిన మనకు ఇందులోని ఎఫెక్టులు సాదాసీదాగా అనిపిస్తాయి.

నటీనటులు:

సినిమాకు ప్రధాన ఆకర్షణ త్రిషనే. ముందు అందంతో ఆకట్టుకుని.. ఆ తర్వాత దయ్యం పాత్రలోనూ మెప్పించింది త్రిష. హన్సిక కూడా పాత్రకు తగ్గట్లు బాగా నటించింది. సిద్ధార్థ్ బాగానే చేశాడు కానీ.. ఇది అతను చేయాల్సినంత ప్రత్యేకమైన పాత్రేమీ కాదు. సుందర్.సి ‘చంద్రముఖి’లో రజినీకాంత్ తరహా పాత్రలో బాగానే చేశాడు. సూరి – కోవై సరళ – మనోబాల ఫుల్లుగా నవ్వించారు. పూనమ్ బజ్వా – రాధారవి తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

హిప్ హాప్ తమిళ అందించిన పాటలు వినసొంపుగా ఏమీ లేవు. ఇందులో పాటలకు పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లు బానే ఉంది. ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలోనూ క్వాలిటీ కనిపిస్తుంది. కామెడీ సీన్స్ లో డైలాగులు బాగున్నాయి. సుందర్.సి దర్శకుడిగా ఏ ముద్రా వేయలేకపోయాడు. ఫిక్స్డ్ ఫార్మాట్ లో తనకు అలవాటైన రీతిలో హార్రర్ కామెడీ మూవీ అందించాడు. కామెడీ వరకు అతడి పట్టు మరోసారి కనిపిస్తుంది.

చివరగా: ‘రొటీన్’గా నవ్వించి కవ్వించిన.. కళావతి.

NO COMMENTS

LEAVE A REPLY