‘కులం మంటల్లో’ ఆజ్యం పోస్తున్న వర్మ.?

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా అది సంచలనమే. సినిమా రిజల్ట్‌ తర్వాత.. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం వర్మ వేసే ఎత్తుగడలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ఆ స్థాయిలో వుంటాయి ఆయనగారి పబ్లిసిటీ స్టంట్స్‌. ‘నేనేదీ వివాదం కోసం చేయను.. నేను ఏం చేసినా కొందరు దాన్ని వివాదంగానే చూస్తారు..’ అని చెప్పడం వర్మకే చెల్లింది.

ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు కులాల కుంపట్లతో రావణకాష్టమైపోతోంది. కాపు సామాజిక వర్గం ‘బీసీ’ రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది. దాన్ని ‘బీసీ’ సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. వెరసి, పరిస్థితి చెయ్యిదాటిపోయేలానే కన్పిస్తోంది. పైకి కన్పించే వ్యవహారమిలా వుంటే, తెరవెనుక ఇది కమ్మ – కాపు సామాజిక వర్గాల గొడవలా తయారయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే రాజధానిని ఆయన సామాజిక వర్గం బలంగా వున్న ప్రాంతంలో నిర్మిస్తుండడం విమర్శలకు తావిచ్చింది.

చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే, కాపు సామాజిక వర్గాన్ని అణచివేయాలనుకుంటున్నారనే విమర్శలు కోకొల్లలు. తన అధికారం కోసం చంద్రబాబు గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని వదిలేశారన్నది కాపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోపణ.

పరిస్థితి ఇంత తీవ్రంగా వున్న సమయంలో రామ్‌గోపాల్‌ వర్మ, ‘వంగవీటి’ అనే సినిమా తీస్తున్నారు. దీన్ని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ వ్యతిరేకిస్తున్నారు. అందరికీ తెల్సిన విషయమే ఆంధ్రప్రదేశ్‌లో కాపు నాయకుడిగా వంగవీటి రంగాకి వున్న ఇమేజ్‌ గురించి. కాపు సామాజిక వర్గానికి ప్రతినిథిగా ఎదిగిన రంగా.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారి చేతుల్లోనే హతమయ్యారు.

అయితే, కమ్మ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివి వున్నవాళ్ళే నిజమైన కాపులని రంగా తనతో చెప్పారంటూ వర్మ, ట్విట్టర్‌లో ‘వంగవీటి’ చిత్రంలో నటుడ్ని పరిచయం చేస్తూ ఫొటోల్నీ, కామెంట్స్‌నీ పెట్టడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ‘వంగవీటి’ సినిమా తీయడం తప్పు కాదు, ఆ సినిమాలో నటించబోయే నటుడ్ని పరిచయం చేయడాన్నీ తప్పు పట్టలేం.. కానీ, ఇక్కడ సామాజిక వర్గాల గురించిన ప్రస్తావన వర్మ ఎందుకు తెచ్చారన్నదే ప్రశ్న.

వివాదం లేకపోతే ఆయన వర్మ ఎందుకు అవుతాడు.? వర్మ టైమింగే టైమింగ్‌.!

NO COMMENTS

LEAVE A REPLY