ఇకపై చకచకా సినిమాలు..బెల్లంకొండ శ్రీనివాస్

అల్లుడుశీను..ఇలా అంటే బెల్లంకొండ శ్రీనివాస్ నా అంటారు… అంత పాపులర్ అయిపోయాడు ఆ ఒక్క సినిమాతో. థాంక్స్ టు బెల్లంకొండ సురేష్.. ఫాదరాఫ్ శ్రీనివాస్.. ఎందుకంటే, సినిమా రంగంలో ఇంతమంది వారుసులు వచ్చారు కానీ, ఏ తండ్రీ, ఏ కొడుకునూ ఈ రేంజ్ లో ప్రెజెంట్ చేసి వుండరు..ప్రమోట్ చేసి వుండరు. దిగ్దర్శకుడు వివి వినాయక్, సమంత..తమన్నా లాంటి హెవీ కాంబినేషన్ లో చేసిన అల్లుడు శ్రీను 34కోట్ల వసూళ్లు సాధించింది. ఆ సినిమా విడుదలయిన తరువాత మళ్లీ ఇప్పుడు రెండో సినిమా స్పీడున్నోడు తో జనం ముందుకు వస్తున్నాడు శ్రీనివాస్..నిజంగా పాటల్లో ఫైటుల్లో స్పీడున్నాడే అనిపించేసుకున్నాడు తొలి సినిమాతోనే. మరి ఈ మలి సినిమాతో ఏం చేయబోతున్నాడు..ఆ ముచ్చట్లేమిటి? అందుకే సినిమా అల్లుడు శీనును కాస్త కదిలిస్తే…

అల్లుడు శీను..తరువాత ఇన్నాళ్లకి స్పీడున్నోడు..కొంచెం గ్యాప్ ఎక్కువైందేమో?

అందరూ అదే అంటున్నారండీ. కానీ మరీ ఎక్కువ గ్యాప్ కాదని నా ఉద్దేశం. ఏడాదిన్నర అంటే సినిమా రంగంలో మరీ గ్యాప్ అంటారా? ఓ హిట్ సినిమా అందించాక, మళ్లీ మంచి సబ్జెక్ట్ దొరకాలి. తొలి సినిమా రేంజ్ కు తగ్గకూడదు..లేదూ అంటే, డౌనైపోయేడ్రా అని మీరే అంటారు..మీరంటే మీరని కాదు..అలా వార్తలు వస్తాయి. సో..ప్రాజెక్ట్ టేకప్ చేసామంటే, దానికి ఓ లైను, లెంగ్త్, వర్త్ వుండాలి కదా..

బోయపాటితో చేయాలనుకుంటాను మీ రెండో సినిమా.?

అవునండీ. కానీ సరైన కథ కుదరడం లేదు. ఆయన ముందు ఓ కథ చెప్పారు. నాకు సెట్ కాదనిపించింది. మరోటి చెప్పారు. బాగానే వుంది కానీ, ఎక్కడో ఏదో చిన్న వెలితి. ఆయన కూడా అదే అన్నారు. శ్రీనూ నేను ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని. సరే, అని మంచి కథ కోసం ఆగాం. ఈ లోగా ఈ ప్రాజెక్టు వచ్చింది.

ఇందులో అంతగా మీకు ఏం నచ్చాయి?

నవరసాలు అంటారే..అలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు వున్నాయి ఈ కథలో. ఫస్ట్ హాఫ్ అంతా కుర్రాళ్ల కోసం సరదా సరదాగా గడిచిపోతుంది. సెకండాఫ్ లో చాలామంది కోరుకునే హ్యూమన్ ఎమోషన్లు, కథ, కథనాలు వుంటాయి.

బోయపాటి కథ నచ్చలేదు. మరో కథ చేస్తున్నా..అంటున్నారు. అంటే స్క్రిప్ట్ లో ఏమేరకు ఇన్ వాల్వ్ అవుతారు మీరు.? 

సినిమా ప్రారంభానికి ముందు స్క్రిప్ట్ దశలో పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతా. మీకు తెలుసా..నేను ఈ స్క్రిప్ట్ లు చదవాలి..వాటి గురించి తెలుసుకోవాలి అనే రెండేళ్లు కష్టపడి తెలుగు చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా తెలుగు చదవగలను ఇంగ్లీష్ మీడియంలో పెరిగినా.

ఈ సినిమా కోసం తమన్నా డ్యాన్స్ మీ సెంటిమెంట్ నా? డైకర్టర్ ఛాయిస్ నా?

ఏక్ట్యువల్ గా ఈ సినిమా ప్రారంభమైపోయాక, డైరక్టర్ భీమినేని గారు అన్నారు. శ్రీనూ..నీ ఫస్ట్ సినిమా ఓ లెవెల్ లో వుంటుంది. సమంత, తమన్నా, ప్రకాష్ రాజ్, ఇలా భారీ తారాగణం..అదీనూ. ఇక్కడ కొత్త హీరోయిన్..అందువల్ల ఏదైనా సమ్ థింగ్ ఏడ్ చేద్దాం అని. మంచి క్రేజ్ వున్న హీరోయిన్, అది కూడా డ్యాన్సింగ్ స్కిల్స్ వున్నవారు ఎవరా అని వెదికాం. మీరు చెప్పండి..ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్లు ఎవరిలో మాంచి డ్యాన్సింగ్ స్కిల్స్ వున్నాయి? నా లెక్కలో తమన్నా ఈజ్ రైట్ ఛాయిస్. మరో మాట చెప్పానా, ఆమెకు వున్న బాహుబలి క్రేజ్ కూడా వాడుకుందాం అనుకున్నాం (నవ్వేస్తూ)

మీ ఫస్ట్ సినిమాలో మీరు డ్యాన్స్ లు, ఫైట్ లు బాగా చేసాడు అని పేరు తెచ్చుకున్నారు. మరి నటన సంగతి?

ఏమండీ..ఆ సినిమాలో అసలు నటనకు చాన్సెక్కడుందండీ? అది చూడకుండా డ్యాన్స్ లు, ఫైట్లు మాత్రం బాగా చేసాడంటారు. ఈ సినిమాలో కాస్త అవకాశం వుంది. వున్న మేరకు కచ్చితంగా చేసాను. నేను కష్టపడి డ్యాన్స్, ఫైట్లు మాత్రమే కాదండీ, నటించడం కూడా నేర్చుకున్నాను. దేనికి స్కోప్ వుంటే దాన్ని ప్రదర్శించగలను.

వివి వినాయక్ గారు యాక్షన్ జోన్. అయినా మీ ఫస్ట్ మూవీలో కామెడీ బాగానే పండింది. భీమినేని గారు అంటే ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్. ఇక్కడ కూడా కామెడీ బాగానే పండిందా?

కామెడీ అంటే అవసరం మేరకు మాత్రమే అండీ. అంటే భీమినేని గారి శుభాకాంక్షలు మాదిరిగా కాదు..సుస్వాగతం మాదిరిగా అనుకోవచ్చు.

బోయపాటితో సినిమా చేద్దాం అనుకుంటే బన్నీ సినిమా అడ్డొచ్చింది..ఇప్పుడు బాలయ్య బాబు సినిమా అడ్డొచ్చేటట్లుంది?

అడ్డు రాలేదండీ..కథ కుదరలేదు. ఈసారి కథ కుదిరేలాగే వుంది. అయితే అది నా మూడోదా, నాలుగోదా ఇప్పుడే చెప్పలేను. కానీ కచ్చితంగా చేస్తాను. మీరే చూస్తారు.

మీతో సినిమా చేయడం వల్ల, మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మీ తండ్రి ఆర్థికంగా దెబ్బతిన్నారని?

ఎవరికి తోచింది వారు చెబుతారండీ. ఎందరికి అని సమాధానం చెప్పగలం. 35 కోట్ల సినిమాకు 34 కోట్లు వచ్చింది. ఇక సమస్య ఏమిటి? నిజానికి మేమే అంచనావేయలేదు. అంత వస్తుందని. నా సినిమా కన్నా ముందు బ్రదర్స్ సంగతేమిటి? అందుకు ముందు ఎన్ని డబ్బింగ్ సినిమాలు, స్ట్రయిట్ సినిమాలు డాడీని ఫైనాన్షియల్ గా దెబ్బతీసాయి. అదంతా నా ఖాతాలో వేసారంతే. అయినా ఇప్పుడు నేను సంపాదించి డాడీకే ఇస్తాగా.

అంతేనా?

కాక..నేనేం చేసుకుంటాను. హీ ఈజ్ ది బెస్ట్ డాడీ. అన్నీ ఇచ్చారు నాకు. మంచి చదువు..మంచి ఇల్లు..మంచి కారు..ఇలా అన్నీ,. ఇంకేం కావాలి నాకు. అందుకే ఆయనకే ఇచ్చేస్తాను.

స్పీడున్నోడు ట్రయిలర్ చూస్తే పక్కా మాస్ మూవీ అనిపిస్తోంది..మీ మొదటి సినిమా అలాంటిదే. అదే జోనర్ లో ముందు వెళ్తారా..లేదా 22 ఏళ్ల వయసులో మాంచి ఫీల్ గుడ్ లవ్ సినిమా చేస్తారా?

మనలో మాట..మన తెలుగులో..డబ్బింగ్ సినిమా సంగతి పక్కన పెట్టండి..సరైన ప్రేమకథ సినిమాలు ఎక్కడ వస్తున్నాయి? అలా అని నేను మరీ నరుకుళ్లు..రక్తపాతాల సినిమాలు చేయడం లేదు. జస్ట్ మాస్ సినిమాలు అంటే మన ప్రేక్షకుల్లో చాలా మంది ఇష్టంగా, సరదాగా చూసే సినిమాలు చేస్తున్నానంతే. వీటిల్లో కూడా హీరోయిన్ వుంటుంది..ప్రేమ వుంటుంది.

స్పీడున్నడుతో ఇక మీ కెరీర్ స్పీడ్ అందుకుంటుందని ఆశించవచ్చా..?

ష్యూర్..ఇకపై చకచకా సినిమాలు చేయాలనే చూస్తున్నా. నాలుగైదు ప్రాజెక్టులు వున్నాయి నా దగ్గర.

గుడ్..బెస్టాఫ్ లక్.

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

NO COMMENTS

LEAVE A REPLY