రోహిత్‌ శర్మకు ప్రమాదం తప్పింది..!

n4d_rohit-sharma

బెంగళూరు వేదికగా ఆసీస్‌తో గురువారం జరిగిన వన్డేలో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు ప్రమాదం తప్పింది. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో ఆసీస్‌ కీపర్‌ వేడ్‌ తన చేతిలోని బంతిని మరో ఎండ్‌లో ఉన్న బౌలర్‌ హెడ్‌కి అందించేందుకు విసిరాడు. ఈ క్రమంలో మధ్యలో ఉన్న రోహిత్‌ శర్మను తాకింది. ఆ బంతి హెల్మెట్‌కి తాకడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. 16వ ఓవర్లో హెడ్‌ వేసిన 5వ బంతిని ఎదుర్కొన్న రోహిత్‌ ఒక పరుగు రాబట్టాడు. బంతిని అందుకున్న వార్నర్‌.. దాన్ని కీపర్‌ వేడ్‌కి అందించాడు. అనంతరం దాన్ని బౌలర్‌ హెడ్‌కి ఇచ్చేందుకు విసరగా మధ్యలో ఉన్న రోహిత్‌ శర్మకు తాకింది. దీంతో మైదానంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ బంతి రోహిత్‌ హెల్మెట్‌ను తగలడంతో హమ్మయ్య అనుకున్నారు. వెంటనే స్పందించిన వేడ్‌ కూడా కావాలని విసరలేదని అనుకోకుండా జరిగిందని క్షమాపణ తెలిపాడు. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ‘వేడ్‌కి దూకుడెక్కువ, ఆటపై ఏకాగ్రత దెబ్బతీయడానికి అతడు కావాలనే ఇలా చేశాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వన్డేలో భారత్‌ 21 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే అక్టోబరు 1న నాగ్‌పూర్‌లో జరగనుంది. భారత్‌ 3-1తో ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకుంది.

NO COMMENTS