సింగరేణి ఎన్నికల ప్రచారం చివరి దశకు…

n4d_singareni

సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. సాధారణ ఎన్నికల స్థాయిలో పోటీ జరుగుతుండటంతో మంత్రుల స్థాయి నేతలు పలు చోట్ల మకాం వేసి పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. మరోవైపు విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయి. సింగరేణి బొగ్గుగనుల్లో ఇప్పుడు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం తరపున మంత్రులు ప్రచారం నిర్వహించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత ప్రత్యక్ష ప్రచార బరిలోకి దిగారు. శ్రీరాంపూర్, మందమర్రి డివిజన్లలో జరిగిన సభలో ప్రసంగించారు. వారసత్వ ఉద్యోగాలే ప్రధాన అజెండాగా మారడంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రకటనను కార్మికుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కలిసికట్టుగా పోరాడుతున్న విపక్ష పార్టీలు కూడా టీఆర్ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్, వామపక్షాల నేతలు మండిపడ్డారు. ప్రచార గడువు దగ్గర పడటంతో టీఆర్ఎస్ అనుబంధ సంఘం కోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టింది.

NO COMMENTS