ముంబయి: వంతెన నిర్మించేందుకు ఆర్మీ సాయం…

n4d_elphinstone-railway-station

ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్లో గత నెల ఘోర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.పాదచారుల వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దీని స్థానంలో కొత్త వంతెన నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఇందుకు సైన్యం సాయం తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ను కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌, రక్షణశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పరిశీలించారు. వీరి వెంట ఫడణవీస్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎల్ఫిన్‌స్టోన్‌, మరో రెండు శివారు రైల్వేస్టేషన్ల వద్ద కొత్త పాదచారుల వంతెనలను నిర్మిస్తున్నాం. ఇందుకోసం సైన్యం సాయం కోరాం. రక్షణశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా అంగీకరించారు.

వచ్చే ఏడాది జనవరి 31 నాటికి ఈ వంతెనల నిర్మాణం పూర్తవుతుంది.’ అని తెలిపారు. అనంతరం నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘ఆర్మీ ఇలా సాయం చేయడం ఇదే తొలిసారి. అయితే ఎల్ఫిన్‌స్టోన్‌ ఘటన పెను విషాదం. ఇందుకు సైన్యం కచ్చితంగా సాయం చేస్తుంది. దగ్గరుండి వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంది.’ అని అన్నారు. సెప్టెంబర్‌ 29న ఈ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా ప్రయాణికులంతా తలదాచుకునే క్రమంలో పాదచారుల వంతెనపైకి చేరారు.ఇంతలో గందరగోళం తలెత్తి తొక్కిసలాట చోటుచేసుకుంది

NO COMMENTS