న్యూయార్క్‌ నిందితుడు మా సైనికుడే (ఐసిస్‌)

n4d-isis

వాషింగ్టన్‌: అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన దాడి తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు తమ సైనికుడేనని ఐసిస్‌ చెప్పుకున్నట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌ మానిటరీ గ్రూప్‌ ఎస్‌ఐటీఈ పేర్కొంది.
న్యూయార్క్‌ వీధుల్లో దాడి చేసింది ఇస్లామిక్‌ స్టేట్‌ సైనికుల్లో ఒకడు అని ఐసిస్‌కు చెందిన ఓ వార్తా పత్రికలో పేర్కొన్నట్లు ఎస్‌ఐటీఈ వెల్లడించింది. ాఅల్లా దయ వల్ల ఈ దాడితో అమెరికాలో భయం పెరిగింది. దీంతో ఆ దేశంలో భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అమెరికాకు వెళ్లే వలసదారులపై చర్యలు తీసుకుంటారు్ణ అని ఐసిస్‌ పేర్కొంది.
న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కు సమీపంలో ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లో అనే వ్యక్తి ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఐసిస్‌ ప్రేరణతోనే తాను దాడి చేశానని.. తాను చేసిన పని పట్ల ఎంతో ఆనందంగా ఉన్నానని సైఫుల్లో విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఐసిస్‌ కూడా సైఫుల్లో తమ సైనికుడేనని ప్రకటించింది.
కాగా.. గత నెల్లో లాస్‌వేగాస్‌లో కాల్పులు జరిపి 58 మందిని పొట్టనబెట్టుకున్న దుండగుడు స్టీఫెన్‌ ప్యాడక్‌ కూడా తమ సైనికుడేనని ఐసిస్‌ ఆ సమయంలో ప్రకటించుకుంది. అయితే స్టీఫెన్‌కు ఐసిస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది.

NO COMMENTS