ఈ షార్క్‌కు పాము తల, 300 పళ్లు

n4d-shark

ఇంటర్నెట్‌డెస్క్‌: షార్క్‌ అంటేనే భయంకరమైన, ప్రమాదకర సముద్రజీవి. అలాంటిది పాము లాంటి తల.. 300 దంతాలతో చూడటానికే భయానకంగా ఉన్న షార్క్‌ను ఇటీవల గుర్తించారు. అతి పురాతనమైన, డైనోసర్ల కాలానికి చెందిన ఈ షార్క్‌ జాతి ఎప్పుడో అంతరించిపోయిందని భావించినా.. మళ్లీ శతాబ్దాల తర్వాత మనిషి కంటికి కనబడింది.
యూరోపియన్‌ యూనియన్‌ శాస్త్రవేత్తల బృందం ఇటీవల పోర్చుగల్‌ తీరంలోని అట్లాంటిక్‌ సముద్రంలోకి వెళ్లింది. కమర్షియల్‌ ఫిషింగ్‌లో భాగంగా అనవసర సముద్ర జీవుల వేటను తగ్గించే మార్గాలను వెతుకుతూసాధారణం కంటే లోతుగా సముద్రంలో ప్రయాణించింది. ఆ సందర్భంలో ఈ శాస్త్రవేత్తలు అరుదైన జాతికి చెందిన అతి పురాతన షార్క్‌ను గుర్తించారు. ఫ్రిల్డ్‌ షార్క్‌గా పిలిచే ఈ షార్క్‌ తల అచ్చం పాములా ఉంటుంది. అంతేగాక.. 25 వరుసల్లో 300 దంతాలు ఉంటాయి. ఈ దంతాలతో మరో షార్క్‌ను కూడా ఇది చీల్చి తినగలదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతేగాక ఇది 6 అడుగుల పొడవు కూడా పెరగగలదట. అంటే ఓ పొడవాటి మనిషి అంత ఉంటుంది. సాధారణంగా జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని సముద్ర ప్రాంతాల్లో ఈ జాతి షార్క్‌లు నివసిస్తుంటాయి.దీని ఆవాసం సముద్రంలో చాలా లోతులో ఉండటంతో మనుషులకు ఎక్కువగా కనబడదు. 19వ శతాబ్దానికి చెందిన నావికులు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియజేశారు.

NO COMMENTS