‘గోల్డెన్‌ వీసా’గా పరిగణించే ఈబీ5 వీసా దరఖాస్తు గడువు పెంపు!

n4d-visa

వాషింగ్టన్: . ‘గోల్డెన్‌ వీసా’గా పరిగణించే ఈబీ5 వీసాల దరఖాస్తుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. ఈ వీసాలు పొందాలనుకునే వారికి ఇది వూరట కల్పించే అంశమని, అయితే గడువు పొడిగింపునకు ఇదే చివరి అవకాశమని నిపుణుల అంచనా. ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్‌1-బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ వీసా ప్రోగామ్‌ను 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్‌ యువతకు ఉపాధి కల్పించాలి. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని అనుకునేవారికి ఇది నిజంగా ‘గోల్డెన్‌ ఛాన్స్‌’. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌1-బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు. హెచ్‌1-బీ నిబంధనలు కఠినతరం అయిన నేపథ్యంలో ఈబీ5కి ఆదరణ పెరిగిందని, భారత్‌ నుంచి ఈ తరహా వీసాలకు దరఖాస్తులు కూడా పెరగనున్నాయని విశ్లేషకులు తెలిపారు.

NO COMMENTS