పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే సంధ్యను పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు..! కార్తీక్

n4d-sandhya_karthik

హైదరాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతోనే సంధ్యరాణిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశానని నిందితుడు కార్తీక్ తెలిపాడు. గురువారం సాయంత్రం ఇంటికి వెళుతున్న సంధ్యారాణిపై కార్తీక్ పెట్రోలు పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే.

తీవ్రగాయాలపాలైన సంధ్యారాణి శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాగా, సంధ్యారాణికి నిప్పంటించిన తర్వాత నిందితుడు కార్తీక్ లాలాగూడ పోలీసులకు లొంగిపోయాడు.

తాను, సంధ్యారాణి ఐదేళ్లుగా ప్రేమించుకున్నామని కార్తీక్ తెలిపాడు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నామని తెలిపాడు. సంధ్యారాణి కూడా తను చేస్తున్న కంపెనీలోనే పనిచేసేదని చెప్పాడు.
కాగా, కొంత కాలం క్రితం కార్తీక్ తన ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత చెడు తిరుగుళ్లకు ఆలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే సంధ్యారాణి ఏదైనా ఉద్యోగం చేయాలని, బాధ్యతగా ఉండాలని కార్తీక్‌కు చెప్పింది. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దామని స్పష్టం చేసింది.

అయినా, తీరు మార్చుకోని కార్తీక్.. పెళ్లి చేసుకోవాలంటూ సంధ్యారాణి వెంటపడ్డాడు.
ముందేమో పెళ్ళి చేసుకుందామన్న సంధ్యారాణి.. ఇప్పుడు మాత్రం ఒప్పుకోలేదని కార్తీక్ తెలిపాడు. గురువారం సాయంత్రం కూడా తాను సంధ్యారాణిని పెళ్లి చేసుకోవాలంటూ బతిమాలానని కార్తీక్ చెప్పాడు. ఐనా నిరాకరించడంతో సంధ్యారాణిపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు కార్తీక్ తెలిపాడు. ఆ తర్వాత తాను పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపాడు.
తమకు తెలిసిన కార్తీక్.. ఇంతటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని అతడి స్నేహితులు చెబుతున్నారు. కాగా, కార్తీకి చెల్లెలికి సంధ్యారాణి స్నేహితురాలే కావడం గమనార్హం. ఈ క్రమంలో సంధ్యారాణి-కార్తీక్ ప్రేమ వ్యవహారం వారింట్లో తెలిసే ఉంటుందని తెలుస్తోంది.

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళలపై దాడులు పెరుగాయన్నారు. నిందితుడు కార్తీక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంధ్యారాణి కుటుంబసభ్యులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని కోరారు.

NO COMMENTS