రామ్‌నాథ్‌ కోవింద్‌: ఆర్థికవేత్తలు వినూత్నంగా ఆలోచించాలి

n4d-Ramnadgovinda

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గుంటూరు: అర్థశాస్త్రం నదీ ప్రవాహం లాంటిదని, ఎన్నో శాస్త్రాలను తనలో ఇముడ్చుకుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. గుంటూరులోని ఏఎన్‌యూలో ఏర్పాటుచేసిన భారత ఆర్థిక సంఘం(ఐఈఏ) సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవింద్‌ మాట్లాడుతూ.. ఐఈఏ వందో వార్షి సదస్సులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశవిదేశాల నుంచి ఎందరో ఆర్థికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఐఈఏ దేశంలోనే అత్యుత్తమ వృత్తి నిపుణుల బృందంలో ఒకటిగా ఉంది. భారత విధాన నిర్ణయాల్లో ఎంతోమంది నిపుణులు పాలుపంచుకున్నారు. కీలక ఆర్థిక సంస్కరణల్లో ఐఈఏ సభ్యులో భాగస్వామ్యం వహించారు. ఇలాంటి సదస్సులు ఆర్థిక ప్రగతికి ఎంతో సహకారం అందిస్తాయి. ఆర్థికవేత్తల ఆలోచనలు వినూత్నంగా ఉండాలి. మహ్మద్‌ యూనిస్‌ ఆలోచన ఉపఖండంలో కొత్తమార్పులు తీసుకొచ్చింది. సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉంది.

పేదరికంలో మగ్గుతున్న కొన్ని వర్గాలపై విస్తృతంగా చర్చించాలి. ఆర్థికవేత్తలు సమష్టిగా ఆలోచనలు చేసి సూచనలు ఇవ్వాలి. మానవ సమాజం కీలకమైన మలుపులో ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం పెంచుకునేలా మరిన్ని సంస్కరణలు రావాలి’ అని పేర్కొన్నారు.

‘ప్రస్తుతం ఆలోచనలే సంపదగా మారాయి. అర్ధశాస్త్రం మన దేశ గమనాన్ని నిర్దేశించింది. కొత్త ఆలోచనలు వస్తేనే సూపర్‌ పవర్‌గా మార్చేందుకు మార్గం సుగమం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మారాలి.

పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం తొలగిపోవాలి. ఆహార భద్రత దిశగా ఆలోచనలు రావాల్సిన అవసరం ఉంది. మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. సుస్థిర అభివృద్ధే తారకమంత్రం కావాలి.

అభివృద్ధే కాదు.. ముందున్న సవాళ్లపైనా దృష్టి సారించాలి’

NO COMMENTS