సంక్రాంతికి ‘గ్యాంగ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది

n4d-Surya

సూర్య… ప్రయోగాలకు మారు పేరు. అలాగని అచ్చంగా అలాంటి సినిమాలే చేయలేదు. మాస్‌.. వూరమాస్‌ సినిమాల్నీ చేశారు. ఓవైపు గజిని, మరో వైపు ‘కాక కాక’. ఓ సారి ‘సెవెన్త్‌ సెన్స్‌’, మరోసారి ‘సింగం’. ఇలా క్లాసూ, మాసూ తేడా లేకుండా అన్ని రకాల సినిమాల్నీ టచ్‌ చేశారు. అందుకే..ఏ, బీ, సీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పుడాయన ‘గ్యాంగ్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సూర్య చెప్పిన విషయాలివీ.. సంక్రాంతికి తెలుగులో భీకరమైన పోటీ ఉంది… అవును.. పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణల చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. వాటితో పాటు మా ‘గ్యాంగ్‌’ కూడా వస్తోంది. పోటీ అని చెప్పను గానీ..చాలామంచి సీజన్‌ ఇది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు తమిళనాట పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటప్పుడు నా సినిమా రావడం ఆనందంగా ఉంది.

పోటీ అనిపించడం లేదా? తమిళనాడుతో పోలిస్తే.. తెలుగునాట థియేటర్లు చాలా ఎక్కువ.ఇంచుమించుగా రెట్టింపు సంఖ్యలో థియేటర్లున్నాయి. కాబట్టి అన్ని సినిమాలకూ మంచి అవకాశం ఉంది. సాధారణంగా మీ సినిమాలు బాలీవుడ్‌ వైపుకు వెళ్తుంటాయి.

కానీ ఈసారి మీరు మాత్రం అట్నుంచి వచ్చిన ఓ సినిమాని రీమేక్‌ చేస్తున్నారు. కారణం ఏమిటి? బాలీవుడ్‌లో విడుదలైన ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’ మంచి విజయం అందుకుంది.నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం ఆ చిత్రం. ‘ఈ కథని మనదైన కోణంలో చెబుదాం’ అని దర్శకుడు విఘ్నేష్‌ నాతో చెప్పారు. ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’ చూసిన వాళ్లకు కూడా మా ‘గ్యాంగ్‌’ కొత్తగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్ని యధాతధంగా వాడాల్సివచ్చింది.ఎందుకంటే.. మూల కథను అనుసరించిన సన్నివేశాల్ని మార్చడానికి కుదరదు.

ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు మీ పాత రోజులు గుర్తొచ్చాయని చెప్పారు. ఎందుకని? సినిమాల్లోకి వచ్చిన తరవాత కారు ప్రయాణాలు తగ్గిపోయాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం కూడా మానేశా.విమానాలు, హోటెల్స్‌లు ఇవి తప్ప మరో ప్రపంచం తెలియడం లేదు. దర్శకుడు విఘ్నేష్‌ ఈ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ‘మీరు రోడ్డు బయట టీ తాగి ఎన్ని రోజులైంది?’ అని అడిగాడు. ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయాను. నిజమే…ఆ రుచి చూసి చాలా యేళ్లయిపోయింది. అదే మాట విఘ్నేష్‌ తో చెప్పా. ‘ఇది అలాంటి కథే సార్‌. మిమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లే కథ’ అన్నాడు.తన అప్రోచ్‌ నాకు బాగా నచ్చింది. కొన్ని రోజుల పాటు అర్థరాత్రి చెన్నై వీధుల్లో టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగడం మొదలెట్టా. ఆ సమయంలో అక్కడి వాతావరణం నిశితంగా గమనించా. ఇవన్నీ ‘గ్యాంగ్‌’ సినిమాలోని నా పాత్రకు బాగా ఉపయోగపడ్డాయి.

మీరెప్పుడూ ‘నడిచి వచ్చిన దారుల్ని మర్చిపోలేదు’ అని చెబుతుంటారు..డబ్బుల కోసం మీరు అంతగా కష్టపడ్డారా? సినిమాల్లోకి రాకముందు ఓ ఎగుమతి, దిగుమతుల కంపెనీలో పని చేసేవాడ్ని. నా తొలి జీతం 726 రూపాయలు. అంతకుముందు ప్రతీ వారం నాన్న ఇచ్చే పది రూపాయల పాకెట్‌ మనీ కోసం చాలా ఆశగా చేతులు చాచేవాడ్ని. కారున్నా..స్కూలుకి నడిచి వెళ్లేవాడ్ని. బస్సులు, ఆటో ప్రయాణాలు ఇవన్నీ తెలుసు. నలుగురితో కలసి ఉంటే సాధకబాధకాలు అర్థమవుతాయన్నది నాన్నగారి ఆలోచన. సినిమాల్లోకి వచ్చేసిన తరవాత ఇలాంటి అనుభవాలన్నీ కరవయ్యాయి.’గ్యాంగ్‌’ లాంటి సినిమాలు చేసినప్పుడు వాటిని మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటుంటా.

ఈ సినిమా కోసం మీరే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ‘గ్యాంగ్‌’లో నా పాత్ర చాలా సున్నితంగా ఉంటుంది. అరుపులూ, కేకలూ ఉండవు (నవ్వుతూ). అందుకే నా గొంతే వినిపించాలనుకున్నాను.తమిళంలో నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ఎనిమిది రోజులు పడితే.. తెలుగు డబ్బింగ్‌ ఆరు రోజుల్లోనే పూర్తయింది. అదంతా రచయిత శశాంక్‌ వెన్నెల కంటి ఇచ్చిన సహకారంతోనే సాధ్యమైంది. తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా అనిపించింది.డబ్బింగ్‌ థియేటర్లో ఉన్నవాళ్లంతా తెలుగువాళ్లే. ఇంటికి వెళ్లి పడుకున్నా.. ఆలోచనలు, కలలు కూడా తెలుగులోనే వచ్చేవి. తెలుగు సుందర భాష అని ఎందుకన్నారో..అర్థమైంది.

తెలుగులో సినిమా ఎప్పుడు? ఈసారి తెలుగులో తప్పకుండా చేస్తా అని చాలాసార్లు చెప్పాను. ఈసారి చెప్పను. కథ, దర్శకుడు అన్నీ పక్కాగా కుదిరిన తరవాత, డేట్లు అన్నీ ఇచ్చేసిన తరవాత తెలుగు సినిమా గురించి నేనే మాట్లాడతా.

కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ల రాకతో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని మీరు భావిస్తున్నారా? ఇద్దరూ ప్రజలకు ఏదో మంచి చేయాలనే భావిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం.ఇద్దరి పార్టీలు వేరు, ఆలోచనలు వేరు, దృక్పథాలు వేరు… అయినా సరే ఆమధ్య ఓ కార్యక్రమంలో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని నడుచుకుంటూ వస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. రాజకీయాలు వేరు, సినిమా వేరు. అయినా సరే…ప్రజల కోసం వాళ్లు ధైర్యంగా ముందడుగు వేశారు. ఈసారి ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రాజకీయాలవైపు అడుగులేసే ఆలోచనలు మీకూ ఉన్నాయా? అలాంటి ఆలోచనలేం లేవు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని నమ్ముతా. మా ట్రస్టు ద్వారా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

NO COMMENTS