నేడు నింగిలోకి 100 ఉపగ్రహం పీఎస్‌ఎల్వీ-సీ40 రాకెట్‌: కౌంట్‌డౌన్ ప్రారంభించిన ఇస్రో

n4d-pslv

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ-40 ద్వారా 31 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. 2018లో ఇదే మొదటి ప్రయోగం కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకే సారి అంతరిక్షంలోకి తరలించి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది.

2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది.

ఈసారి మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగిస్తుండగా, వాటిలో 28 విదేశాలకు చెందినవి. ప్రధానంగా ‘కార్టోశాట్‌-2’ సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం భారత్‌కు చెందినది. దీనితో పాటు మైక్రో, నానో (ఐఎన్‌ఎస్‌)లు మనదేశానివి. ఈ ప్రయోగంలో దేశీయ 100వ ఉపగ్రహం ఉండటం విశేషం.

కౌంట్ డౌన్ మొదలు

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ40 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈమేరకు 28 గంటల కౌంట్‌డౌన్ గురువారం ఉదయం 5:29 గంటలకు ప్రారంభమైంది. గత ఏడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ-సీ39 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో అన్ని చర్యలూ తీసుకుంది.

NO COMMENTS