‘స్పీడున్నోడు’ రివ్యూ

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాడు గాని సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే కమర్షియల్ హిట్ మీద కన్నేసిన యంగ్ హీరో తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండ్యన్ సినిమాను స్పీడున్నోడు పేరుతో రీమేక్ చేశాడు. సుడిగాడు సినిమా తరువాత మూడేళ్ల విరామం తీసుకున్న రీమేక్ స్పెషలిస్ట్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు. గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని స్వయంగా నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు తొలి కమర్షియల్ హిట్ అందించిందా..?

కథ :
అనంతపురంలోని రాప్తాడు ప్రాంతంలో ఊరి పెద్ద వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్) కొడుకు శోభన్ బాబు(బెల్లంకొండ శ్రీనివాస్). డిగ్రీ పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి అల్లరి చిల్లరగా తిరగుతుంటాడు. తన ఫ్రెండ్స్ కోసం ఎలాంటి రిస్క్‌కైనా వెనుకాడని శోభన్, గిరి అనే స్నేహితుడి ప్రేమను గెలిపించడానికి వాసంతి(సోనారికా)ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో వాసంతి, శోభన్‌ను ఇష్టపడుతోంది. ఈ ఇద్దరి ప్రేమ వాసంతి ఇంట్లో తెలియటంతో వాసంతి తండ్రి రామచంద్రప్ప (రావు రమేష్) వాసంతిని జగన్ (కబీర్ దుహాన్ సింగ్)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో వాసంతి మీద యాసిడ్ దాడి చేయబోయిన వాడ్ని ఆపే ప్రయత్నంలో శోభన్ అతన్ని చంపేస్తాడు. ఇలా అన్నిరకాలుగా శోభన్ ప్రేమకు ఆటంకాలు ఏర్పాడతాయి. ఈ ఇబ్బందులనుంచి శోభన్ ఎలా బయటపడ్డాడు. వాసంతిని ఎలా దక్కించుకున్నాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు
తొలి సినిమాతో పరవాలేదనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాలో మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. సోనారికా గ్లామర్‌తో పాటు నటనలోనూ మంచి మార్కులే సాధించింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డిలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయగా, పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ పండించారు. కృష్ణచైతన్య, కబీర్ విలన్స్‌గా ఆకట్టుకున్నారు. రమాప్రభ, శ్యామల, ఝాన్సీ, విద్యుల్లేఖ లాంటి చాలా మంది ఆర్టిస్ట్‌లు ఉన్నా ఎవరికి గుర్తింపు వచ్చే స్థాయి పాత్రలు దక్కలేదు.

సాంకేతిక నిపుణులు
రీమేక్ సినిమాలు తీయటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న భీమినేని మరోసారి తన మార్క్ చూపించాడు. తమిళ కథే అయిన ఏ మాత్రం ఆ ఫ్లేవర్ లేకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా స్పీడున్నోడు సినిమాను తెరకెక్కించాడు. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న భీమినేని ఆ రంగంలోనూ సక్సెస్ సాధించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో స్పీడున్నోడు సినిమాను తెరకెక్కించాడు. డిజె వసంత్ సంగీతం పర్వాలేదు. చాలా సన్నివేశాల్లో నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. విజయ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి ఫ్రేము రిచ్ గా రావటం కోసం విజయ్ తీసుకున్న కేర్ స్పష్టంగా కనిపించింది. గౌతంరాజు ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తగా వర్క్ చేసి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్
మెయిన్ స్టోరి
క్లైమాక్స్
ప్రొడక్షన్ వాల్యూస్
తమన్నా స్పెషల్ సాంగ్

మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
ఎడిటింగ్
పాటలు

ఓవరాల్ గా స్పీడున్నోడు.. భీమినేని మార్క్ కామెడీ డ్రామా మాత్రమే.. స్టార్ ఇమేజ్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా వరకు వెయిట్ చేయక తప్పదు.

NO COMMENTS

LEAVE A REPLY